నూరు శాతం ఫలితాలు సాధించాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాల్లోని పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఫలితాలను సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ అన్నారు. జిల్లాలో పదో తరగతి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థంగా అమలు చేయాలని కోరుతూ జిల్లాలోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాన్ని సోమవారం విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. చంద్రకళ మాట్లాడుతూ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సబ్జెక్ట్ టీచర్లు, క్లాస్ టీచర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి మౌలిక నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బలహీన విద్యార్థులకు తప్పనిసరిగా రీమీడియల్ బోధన నిర్వహించాలన్నారు. విద్యార్థుల పరీక్ష మార్కులు నిర్ణీత గడువులోపు అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో అందుబాటులో ఉండాలని, ఉపాధ్యాయుల హాజరు, బోధనా ప్రక్రియ, విద్యార్థుల హాజరును నిరంతరం పరిశీలించాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన అన్ని రికార్డులు, విద్యార్థుల ప్రగతి నివేదికలు, బోధనా నోట్స్ పాఠశాలల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలబెట్టేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోని 187 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపవిద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ, జిల్లా పరీక్షల కమిషనర్, ఏఎస్‌ఓ తదితరులు పాల్గొన్నారు.


