ప్రతి అర్జీని నిబద్ధతతో పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల సంతృప్త్త సేవలే నాణ్యతకు గీటురాయి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన ప్రతి అర్జీని సకాలంలో నిబద్ధతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్) జరిగింది. జేసీ ఎస్.ఇలక్కియ, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఉపాధి కల్పన, రెవెన్యూ సేవలు తదితర అంశాలపై మొత్తం 229 అర్జీలు అందాయన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సులో విలువైన సూచనలు ఇచ్చారని తెలిపారు
కొత్త యూనిట్ల అభివృద్ధికి చర్యలు
ఎంఎస్‌ఎంఈల ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. కొత్త పారిశ్రామిక యూనిట్లతో పాటు ఉన్న యూనిట్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో ఒక చోట అనుమతి తీసుకొని మరో చోట తవ్వకాలు చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై రెండు సార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని సర్వే నంబర్ 46 ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు కూడా చూసీ చూడనట్లు ఉంటున్నారని’ గ్రామానికి చెందిన జమలయ్య పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.


