శాసీ్త్రయ ఆలోచనతో విద్యార్థుల సమగ్రాభివృద్ధి
కృష్ణా డీఈఓ సుబ్బారావు
మచిలీపట్నంఅర్బన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన.. తార్కిక శక్తిని, సమస్యలను విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు అన్నారు. జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనతో పాటు జాతీయ గణిత దినోత్సవం సోమవారం స్థానిక లేడీ యాంప్తిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజన, ఆత్మవిశ్వాసం, పరిశోధనపై ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రపంచ స్థాయిలో మల్టీనేషనల్ సంస్థల్లో సీఈఓలుగా పనిచేస్తున్న భారతీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ ప్రదర్శనలో మొత్తం 196 వైజ్ఞానిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్, డీసీఈబీ సెక్రటరీ విజయ్, లేడీ యాంప్తిల్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.శ్రీరమ, జిల్లా స్థాయి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


