సంతకాలతో సమరశంఖం
జిల్లాలో కోటి సంతకాల సేకరణ విజయవంతం ● జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరిన సంతకం ప్రతులు
● భవిష్యత్ తరాల బాగు కోసం ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ పోరు
● జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ పూర్తి
● నందిగామలో కొనసాగుతున్న కార్యక్రమం ● విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక భ్రమరాంబపురం నుంచి సత్యంగారి హోటల్ వరకూ పెద్ద సంఖ్యలో ప్రజలతో ర్యాలీ అట్టహాసంగా సాగింది. అక్కడి నుంచి ఆటోలో సంతకాల పేపర్లు ఉన్న బాక్సులతో వాహనాలపై ర్యాలీగా గుణదలలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి చేర్చారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
● జగ్గయ్యపేట నియోజకవర్గం, కోదాడ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి సంతకాలు సేకరించిన పత్రాలు ఉంచిన వాహనాన్ని నియోజకవర్గ పరిశీలకుడు రాష్ట్ర కార్యదర్శి ఆళ్ల చల్లారావు, నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాత మునిసిపల్ సెంటర్, కమల సెంటర్ మీదుగా మండలంలోని చిల్లకల్లు గుండా విజయవాడకు ప్రత్యేక వాహనాన్ని కార్యకర్తలు నాయకులు ర్యాలీగా తీసుకొచ్చారు.
● విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని భవానీపురం శివాలయం సెంటర్‌లోని కొనకళ్ల విద్యాధరరావు ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు కూడళ్ల మీదుగా సందడిగా కొనసాగింది. ఈ ర్యాలీని తొలుత వెస్ట్ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించగా, అక్కడి నుంచి సంతకాల పత్రాలతో కూడిన వాహనం గుణదలలోని పార్టీ జిల్లా కార్యాలయానికి చేరింది. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రూహుల్లా, కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఆంధ్రప్రభ కాలనీలో పార్టీ నియోజకవర్గ కార్యాలయం నుంచి సంతకాల పత్రాలను అట్టహాసంగా జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ పత్రాలతో కూడిన వాహనాన్ని సెంట్రల్ ఇన్‌చార్జి మల్లాది విష్ణు, నియోజకవర్గ పరిశీలకులు సర్నాల తిరుపతిరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఆ పత్రాలను తీసుకెళ్లి జిల్లా కార్యాలయంలో అప్పగించారు.
● గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో 40వేల సంతకాలను సేకరించారు. బుధవారం వాటి ప్రతులను జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పంపించారు. జెడ్పీటీసీలు అన్నవరపు ఎలిజబెత్ రాణి, కాకర్లమూడి సువర్ణ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు నీలం ప్రవీణ్ కుమార్, వింత శంకరరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎం. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
● పెనమలూరు నియోజకవర్గం నుంచి బందరు లోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. కానూరు గ్రామంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి జెండా ఊపి ప్రారంభించారు. జెడ్పీటీసీ సభ్యుడు బాకీ బాబు, ముఖ్య నాయకులు పి. రాఘవరావు, నందిపాటి బింధు మాధవి, వేమూరి బాలకృష్ణ, షేక్ అబూ కలాం, జంపాన కొండలరావు పాల్గొన్నారు.
జిల్లాలో కోటి సంతకాల సేకరణ విజయవంతం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలు ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పూర్తయ్యింది. నందిగామ నియోజకవర్గంలో మాత్రం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఆ ఆరు నియోజకవర్గాల్లో 4.16లక్షల సంతకాలు సేకరించారు. కాగా ఆయా నియోజకవర్గాల నుంచి సంతకాలు సేకరించిన పత్రాలను అట్టహాసంగా ర్యాలీలు నిర్వహించి బుధవారం విజయవాడలోని జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చారు. ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.