‘భోజనం తినలేక పోతున్నాం’
పులిగడ్డ(అవనిగడ్డ): గురుకుల పాఠశాలలో పెడుతున్న భోజనం తినలేక పోతున్నామని, ఏదీ సరిగా వండరని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కె. కృష్ణకిరణ్‌కు విద్యార్థులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పులిగడ్డ గురుకుల పాఠశాల, అవనిగడ్డలో జెడ్పీ హైస్కూల్, పలు అంగన్‌వాడీ కేంద్రాలను కృష్ణకిరణ్ బుధవారం తనిఖీ చేశారు. తొలుత పులిగడ్డ గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 90 శాతం మంది విద్యార్థులు సరైన ఆహారం పెట్టడం లేదని లిఖితపూర్వకంగా చెప్పారు. అనంతరం అవనిగడ్డలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలు, జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. ఐసీడీఎస్ సీడీపీవో ప్రసన్న విశ్వనాథ, తూనికలు, కొలతలు అధికారి ఈశ్వరరావు, ఉప విధ్యాధికారి శేఖర్ సింగ్ పాల్గొన్నారు.


