భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్లు కొలువైన ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు సిద్ధమైంది. మాల విరమణకు తరలివచ్చే భవానీలకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణ 15వ తేదీ ఉదయం మహాపూర్ణాహుతితో ముగుస్తుంది. తొలి రోజు తెల్లవారుజామున 6.30 గంటలకు మహా మండపం దిగువన హోమగుండాల్లో అగ్నిప్రతిష్టాపనతో దీక్షల విరమణ ప్రారంభమవుతుంది. ఐదు రోజులు కొనసాగే ఉత్సవాలకు ఆరు లక్షల మంది భవానీలు దీక్షల విరమణ చేస్తారని పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
రోజూ 20 గంటల పాటు అమ్మ దర్శనం
దీక్షల విరమణలో తొలి రోజు మినహా మిగిలిన నాలుగు రోజుల్లో రోజూ 20 గంటలకు పైగా అమ్మ వారి దర్శనం ఉంటుంది. గురువారం తెల్లవారుజామున ఆరు గంటలకు అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం దర్శనం ప్రారంభమవుతుంది. శుక్రవారం నుంచి తెల్లవారుజాము మూడు నుంచి రాత్రి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమయంలో అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేస్తారు. ఇక సాయంత్రం అంతరాలయంలో పంచహారతుల సేవ జరుగుతుండగా, బయట అన్ని క్యూలైన్లు యథావిధిగా నడిచేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో పంచహారతుల సమయంలోనూ అమ్మవారిని భక్తులు దర్శించుకునే వీలు కలుగుతుంది. రద్దీ మరింత అధికమయితే చివరి మూడు, నాలుగు రోజుల్లో దర్శన సమయాన్ని మరింత పెంచే అవకాశాన్ని వైదిక కమిటీ పరిశీలిస్తోందని ఆలయ అధికారులు తెలిపారు.
అల్పాహారం పంపిణీకి ఏర్పాట్లు
భవానీలు, భక్తులకు దేవస్థానం అన్న ప్రసాదంతో పాటు అల్పాహారం పంపిణీ చేయనుంది. తెల్లవారుజాము ఆరు నుంచి పది గంటల వరకు పులిహోర, దద్యోజనం, కట్టెపొంగలి, ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలకు వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం అక్కన్న, మాదన్న గుహల ఎదుట వెలివేటెడ్ క్యూలైన్ల కింద ఐదు నుంచి ఏడు గంటల వరకు కదంబం, ఏడు నుంచి 11 గంటల వరకు ఉప్మా పంపిణీచేస్తారు. రోజుకు 32 వేల మందికి అన్న దానం, అల్పాహారం పంపిణీచేసేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. లడ్డూ ప్రసాదాలను కొరినన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు 30 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం సిద్ధం చేస్తోంది. బుధవారం సాయంత్రం నాటికి ఆరు లక్షల లడ్డూలను సిద్ధం చేసింది.
ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీ మాలధారులు
నేటి ఉదయం 6.30 గంటలకు
అగ్ని ప్రతిష్టాపన
ఐదు రోజులు కొనసాగనున్న ఉత్సవాలు
భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం


