ఎన్‌ఆర్‌సీని తనిఖీచేసిన ఎన్టీఆర్ డీఎంహెచ్‌ఓ
లబ్బీపేట(విజయవాడతూర్పు): పోషకాహారలోపం ఉన్న చిన్నారుల పునరావాస కేంద్రాన్ని (ఎన్‌ఆర్‌సీ) బుధవారం ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తనిఖీచేశారు. పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఎన్‌ఆర్‌సీ సెంటర్‌కి వెళ్లి, అక్కడ ఉన్న 14 మంది చిన్నారులను పరిశీలించారు. పోషకాహార లోపం కారణంగా వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేక పోవడంతో వారికి ఈ కేంద్రానికి తీసుకొచ్చినట్లు సిబ్బంది తెలిపారు. వారంతా జక్కంపూ డికాలనీ, వాంబేకాలనీ, రాజరాజేశ్వరిపేట, చిట్టినగర్ ప్రాంతాల వారని వివరించారు. విజయవాడతో పాటుజిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుహాసిని బుధవారం పరిశీలించారు.
రైలు నుంచి జారిపడి
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. బుధవారం తెల్లవారు జామున రాయనపాడు రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని డౌన్‌లైన్‌లో పురుషుడు గాయాలతో మృతిచెంది పడివున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది విజయవాడ జీఆర్‌పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థాలానికి వెళ్లి వివ రాలు సేకరించారు. మృతుని ఎత్తు 5.9 అడు గులు, వయస్సు సుమారు 46–48 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై నీలం టీషర్ట్, నీలం లోయర్ ఉన్నాయని, ఇతర ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్‌పీ స్టేషన్‌లో లేదా 88971 56153, 94406 27544 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు.
బస్సు నుంచి పడి
వృద్ధుడి దుర్మరణం
పెనమలూరు: మండలంలోని వణుకూరులో వృద్ధుడు సిటీ బస్సు నుంచి ప్రమాదవశాత్తు కొందపడి మృతి చెందాడు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. వణుకూరుకు చెందిన ఉప్పులూరి కోటేశ్వరరావు (70) సరుకుల కోసం మంగళవారం పటమట వెళ్లారు. సరుకులు తీసుకున్నాక సిటీ బస్సులో వణుకూరు బయలుదేరారు. గ్రామానికి వస్సు వచ్చాక దిగటా నికి ఫుట్‌పాత్‌పై నిలబడిన సమయంలో కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయమవటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడు కోటేశ్వరరావు భార్య శివనాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


