మైనర్ల అక్రమ రవాణాను అడ్డుకున్న ఆర్‌పీఎఫ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): మైనర్ల అక్రమ రవాణాను విజయవాడ డివిజన్ ఆర్‌పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. ఆపరేషన్ యాక్షన్, ఆపరేషన్ యాత్రి సురక్ష, ఆపరేషన్ నాన్హే ఫారిస్టే సేవల్లో భాగంగా ఈ నెల 8, 9 తేదీల్లో పలు కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఆపరేషన్ యాక్షన్‌లో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన నెల్లూరు, ఒంగోలు ఆర్‌పీఎఫ్, విజయవాడ సీఐబీ, బచపన్ బచావ్ ఆందోళన్ రాష్ట్ర సమన్వయకర్తలు, ఏపీఓల సంయూక్త బృందాలు ఒంగోలు– నెల్లూరు మధ్య టాటానగర్–యర్నాకులం ఎక్స్‌ప్రెస్ (18189) రైలులో తనిఖీలు చేపట్టారు. ముగ్గురు బాలురిని గుర్తించి విచారించగా, ఇద్దరు ఏజెంట్టు వారిని పనుల కోసం ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు తేలింది. తదుపరి దర్యాప్తు కోసం ఏజెంట్లను నెల్లూరు జీఆర్‌పీ పోలీసులకు అప్పగించి, మైనర్‌లను సీడబ్ల్యూసీ సమక్షంలో పునరావాస కేంద్రానికి తరలించారు. ఆపరేషన్ యాత్రి సురక్షలో భాగంగా గుంటూరు–రాయగడ (17243) ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడి బ్యాగులోని నగదు, సెల్‌ఫోన్ చోరీ కేసుపై ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీ సులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి తుని రైల్వేస్టేషన్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.54 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆపరేషన్ నాన్హే ఫారిస్టేలో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 13 ఏళ్ల బాలుడిని విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఆరో నంబర్ ప్లాట్‌ఫాంపై గుర్తించారు. బాలుడిని సంరక్షణ నిమిత్తం చైల్డ్ హెల్ప్ డెస్క్‌కు అప్పగించారు. అక్కడ బాలుడికి కౌన్సిలింగ్ చేసి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. అపరేషన్ అమానత్‌లో భాగంగా ఒంగోలు, అనకాపల్లి స్టేషన్లలో ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగులను స్వాధీనం చేసు కుని యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డీఎస్‌సీ (డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్) షణుగ్మ వడివేల్ ఆర్‌పీఎఫ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.


