అంగన్‌వాడీ వర్కర్లకు 5జీ సెల్ ఫోన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవలు అందించేందుకు అంగన్‌వాడీ వర్కర్లకు 5జీ మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అంగన్‌వాడీ వర్కర్లకు సెల్ ఫోన్లు అందించే కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. 58,204 మంది వర్కర్లు, సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్లతో 5జీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల వివిధ శాఖల ర్యాంకులు ప్రకటించగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో 98 శాతం సేవలతో ఏ++ కేటగిరీతో నాలుగో స్థానంలో నిలవటం అభినందనీయమన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలను అందంగా అలంకరించటానికి ముస్తాబు కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో కొత్త యూనిఫాం, అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.లక్ష చొప్పున అందిస్తామన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం కార్యదర్శి ఎ.సూర్యకుమారి, సంచాలకుడు ఎం.వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కె.ప్రవీణ, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు.


