దీక్షల విరమణ బందోబస్తుపై దిశానిర్దేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంద్రకీలాద్రిపై ఐదు రోజుల పాటు జరగనున్న భవానీ దీక్షల విరమణకు బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు దిశా నిర్దేశం చేశారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బందోబస్తు సిబ్బందితో సీపీ బుధవారం సమావేశం నిర్వహించారు. సిబ్బంది రెండు షిఫ్టుల్లో విధులకు హాజరు కావాలని సూచించారు. గిరిప్రదక్షిణ మార్గం, హోల్డింగ్ ఏరియాలు, స్నానఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలను డ్రోన్ కెమెరా వీడియోల రూపంలో చూపించి తగు సూచనలు, సలహాలు అందించారు. భవానీలతో మర్యాదగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. టాఫిక్ అవాంతరాలు కలుగకుండా చూడాలన్నారు. అంతరాలయం పరిసరాలు, కొండ దిగువన, క్యూలైన్లు, ఇరుముడి విరమణ ప్రదేశాలు, హోమ గుండాలు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గానగర్, రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వంటి ముఖ్య ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జేబు దొంగతనాలు, గొలుసు చోరీలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, బి.లక్ష్మీనారాయణ, షిరీన్‌బేగం, ఎస్.వి.డి.ప్రసాద్, జి.ఆనంద్‌బాబు, ఏడీసీపీ జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దుర్గగుడి పరిసరాలను సీపీ రాజశేఖరబాబు క్షేత్రస్థాయిలో సందర్శించారు.


