భలే భలే.. బాలోత్సవం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఎనిమిదో అమరావతి బాలోత్సవం బుధవారం చిన్నారుల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగింది. రెండో రోజైన బుధవారం జరిగిన సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్ధార్థ ఆడిటోరియంతో పాటుగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు వేదికలపై ఈ పోటీలు జరిగాయి. చిత్రలేఖనం, తెలుగు డిక్టేషన్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, షార్ట్ ఫిల్మ్ విశ్లేషణ, డిబేట్, కోలాటం, దేశభక్తి గీతాలాపన, క్లాసికల్ డాన్స్, జానపద గీతాలాపన, తెలుగు పద్యాలు, ఇంగ్లిష్ రైమ్స్, పద్యం–భావం అంశాల్లో పోటీలు జరిగాయి. విజయవాడ నగరంతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నాం 3.30 గంటలకు బాలోత్సవం ముగింపు సభ, విజేతలకు బహుమతులు ప్రదానం జరుగుతా యని బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు తెలిపారు.


