కొమ్మా కోటేశ్వరరావుకు 15 వరకు రిమాండ్
రామవరప్పాడు(విజయవాడ రూరల్): కృష్ణాజిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ టీడీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో కొమ్మా కోటేశ్వరరావు(కొమ్మా కోట్లు)కు ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌లో ఆయన స్వచ్ఛందంగా లొంగిపోగా పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పి.భాస్కరరావు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు.


