అర్జీల సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలి
ఇన్‌చార్జి కలెక్టర్ ఇలక్కియ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. ఇన్‌చార్జి కలెక్టర్ ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. అర్జీదారుకు సత్వర, సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయిలో 162 అర్జీలు
జిల్లా స్థాయిలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 162 అర్జీలు అందినట్టు ఇలక్కియ చెప్పారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 65 అర్జీలు అందాయన్నారు. పోలీసు శాఖ 20, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ 26, పంచాయతీరాజ్‌కు 10 ఫిర్యాదులు వచ్చాయన్నారు. విద్యాశాఖ 6 , పౌరసరఫరాల శాఖకు 5, వైద్య ఆరోగ్య శాఖకు 4, సర్వే, ఏపీ సీపీడీసీఎల్, జలవనరుల శాఖలకు 3చొప్పున, ప్రజా రవాణా శాఖ (ఏపీఎస్‌ఆర్టీసీ), డీఆర్డీఏ, కార్మిక, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం శాఖలకు రెండు చొప్పున, గృహ నిర్మాణం, పశుసంవర్ధక శాఖ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, సహకార శాఖ, అటవీ, దేవదాయ, ఐసీడీఎస్, బీసీ సంక్షేమం, అగ్నిమాపక శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎం.లక్ష్మీ నరసింహం, జెడ్పీ సీఈవో కన్నమ నాయుడు, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జ్యోతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్‌టీఐహెచ్ తోడ్పాటుతో పరిశ్రమల ఏర్పాటు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) తోడ్పాటుతో పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇగ్నైట్ సెల్‌ను ఆమె సందర్శించారు. దీనిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్–విజయవాడ స్పోక్ ఆధ్వర్యంలో యువత వివిధ సమస్యలకు చూపిన సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడళ్ల కంటే 60 శాతం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ప్రోస్తెటిక్ చేతిని విష్ణు అసిస్టివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రదర్శించింది. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ–టీమ్ స్కైవర్క్స్ బృందం స్వయం నియంత్రిత డ్రోన్ లాస్ట్–మైల్ డెలివరీ వ్యవస్థను ప్రదర్శించింది. మారీస్ స్టెల్లా కళాశాల విద్యార్థులు సామాజిక ప్రభావం కలిగించే పలు సాంకేతికతలను ప్రదర్శించారు. ప్రోగ్రామ్ అసోసియేట్స్ జి.సుజాత, సౌమ్య మనోజ్, ఆర్‌టీఐహెచ్ సీఈవో జి.కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.


