కొనసాగుతున్న కూల్చివేతల పర్వం
వీఎంసీ కార్యాలయం ఎదుట శివాజీ విగ్రహ నిర్మాణాన్ని కూల్చిన అధికారులు విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్ ఆమోదం తెలిపినా అడ్డుకున్న కూటమి ప్రభుత్వం హిందుత్వంపై దాడిగా పేర్కొంటున్న స్థానిక నేతలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): బెజవాడలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఇటీవల జోజినగర్‌లోని 42 ఇళ్లను కూల్చివేయగా, ఆదివారం అధికారులు మరో కూల్చివేతను చేపట్టారు. భారతదేశ ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిన శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణాన్ని సైతం కూల్చివేశారు. ఈ ఘటన యావత్ నగర వాసులను విస్మయానికి గురి చేసింది.
వీఎంసీ కార్యాలయం ఎదుట శివాజీ విగ్రహం నిర్మాణం
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట కృష్ణా మెయిన్ కెనాల్ ఒడ్డున పార్క్ ఉంది. అందులో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పాతబస్తీలోని మరాఠీ, ఉత్తర భారతీయ సంఘాలు స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీకి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. వేలాదిగా ఉన్న ఆయా ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చటర్జీ కౌన్సిల్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని క్రీడలు అండ్ ట్రాఫిక్ ప్రత్యేక కమిటీకి పంపగా ఆ కమిటీ చర్చించి ఆమోదం తెలిపింది. కౌన్సిల్ కూడా దాన్ని అంగీకరించింది. దీంతో ఉత్తర భారతీయ సంఘాలు, మరాఠీ సంఘ ప్రతినిధులు శివాజీ మహారాజ్ విగ్రహం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పీఠాన్ని నిర్మించారు. అయితే ఆదివారం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ నిర్మాణాన్ని ఽనగర పాలక సంస్థ సిబ్బంది ధ్వంసం చేశారు. కౌన్సిల్ ఆమోదం తెలిపిన నిర్మాణాన్ని ఽకూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై మరాఠీ సంఘ ప్రతినిధులు, ఉత్తర భారతీయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ధ్వంసం చేయడం దారుణం
శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి కౌన్సిల్ అనుమతి ఉంది. జరుగుతున్న నిర్మాణాన్ని కూల్చివేయడం దారుణం. అభ్యంతరం ఉంటే దానిని కౌన్సిల్‌లో చర్చించి వ్యతిరేకించాలి. అంతేకానీ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు.
– మండేపూడి చటర్జీ, కార్పొరేటర్, 37వ డివిజన్
కొనసాగుతున్న కూల్చివేతల పర్వం


