సంగీతం సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం
కేంద్ర పర్యాటక శాఖ ఏడీజీ వెంకటరామన్ హెగ్డే
భవానీపురం(విజమవాడపశ్చిమ): పర్యాటక రంగం పురోభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊతమివ్వడం ద్వారా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందే వీలు ఉంటుందని కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకటరామన్ హెగ్డే అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి ఆదివారం ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట రామన్ హెగ్డే మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖ సంగీత విద్వాంసులు ఇచ్చిన ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా అలరించాయనన్నారు. సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజల మధ్య సంబంధాలు పెరుగుతాయన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ సంచాలకుడు (సౌత్) ఆర్.వెంకటేశన్ మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో టూరిజం శాఖ నిబద్ధతతో వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ప్రముఖ సంగీత విద్వాంసుడు మల్లాది రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత గవర్నర్ నజీర్ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శించారు.


