రాజకీయ వేదికగా మారిన మెగా పీటీఎం3.0
భోజనాల్లేవు..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పీటీఎం 3.0 పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తుతూమంత్రంగానే కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాలోని 914, కృష్ణా జిల్లాలో 1,317 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమావేశాలను నిర్వహించారు. దాదాపుగా అన్ని పాఠశాల్లోనూ ఈ సమావేశాలు నిర్వహించినా వాటిల్లో ఎక్కడా పూర్తి స్థాయిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కానరాలేదు. అలాగే జరిగిన సమావేశాల్లో స్థానికంగా ఉన్న సమస్యలపై ఎవరూ ఏమీ స్పందించకపోవటం తల్లిదండ్రులను విస్మయానికి గురి చేశాయి.
‘నాడు–నేడు’ గురించి ప్రస్తావన లేదు..
ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 500 పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. దాదాపుగా నిధులు సైతం అందజేసింది. అరకొరగా ఉన్న పనులను పూర్తి చేయటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు దాటినా ఇప్పటి వరకూ వాటి ప్రస్తావన లేదు. తాజాగా తల్లిదండ్రుల సమావేశాల్లో వాటి గురించి ప్రస్తావన ఉంటుందని హాజరైన వారంతా ఆశించారు. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడకపోవటంతో నిరాశగా వెనుదిరిగారు.
తల్లిదండ్రుల అనాసక్తి..
మెగా పేరంట్స్ సమావేశాల్లో ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా తల్లిదండ్రుల హాజరు 20 నుంచి 30 శాతం సైతం దాటలేదు. సమావేశాలకు పూర్తి స్థాయిలో తల్లిదండ్రుల హాజరు కాకపోవటంతో ఉపాధ్యాయులు వచ్చిన వారితోనే మాట్లాడి ఫొటోను అప్‌లోడ్ చేశారు. ప్రధానంగా స్థానిక ప్రజాప్రతినిధులు హాజరైన సమావేశాలకు సైతం తల్లిదండ్రులు హాజరు పూర్తి స్థాయిలో కనపడలేదు. విజయవాడ పాతబస్తీలో స్థానిక శాసనసభ్యుడు హాజరుకాలేదు. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు గాంధీజీ మునిసిపల్ హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 67వేల మంది తల్లిదండ్రులు, 73,889 మంది విద్యార్థులు హాజరైనట్లుగా హడావుడిగా ప్రకటించింది.
రాజకీయ ఉపన్యాసాలకే పరిమితం..
చాలాచోట్ల సమావేశాలకు కూటమి నాయకులు ఎటువంటి హోదా లేకపోయినా హాజరై హడావుడి చేశారు. వచ్చిన నాయకులు కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే ఎక్కడా నాడు–నేడు కింద ఆగిపోయిన పనులు, ఉపాధ్యాయుల కొరత వంటి అంశాలపై ప్రస్తావించిన దాఖలాలు లేవు. దాదాపుగా నాయకులందరూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్, నారా లోకేష్‌లను పొగుడుతూ ప్రసంగాలు చేస్తూ హడావుడి చేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాల్లో తప్పనిసరిగా వచ్చిన వారికి మధ్యాహ్న భోజనం పథకంలోని భోజనాలను వడ్డించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అరకొర నిధులే కేటాయించింది. దాంతో ఎక్కడా పాఠశాలల్లో భోజనం చేసిన దాఖలాలు కనపడలేదు. ఎన్టీఆర్ జిల్లాలో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి రెండు పాఠశాలల్లో మినహా ఎక్కడా తల్లిదండ్రులు భోజనాలు చేయలేదు. అలాగే తల్లిదండ్రులకు వేరువేరుగా వివిధ పోటీలను నిర్వహించాల్సి ఉంది. అవి కూడా ఎక్కడా పూర్తి స్థాయిలో జరగలేదు.
జిల్లా వ్యాప్తంగా అన్ని
పాఠశాలల్లోనూ సమావేశాలు
ఆసక్తి చూపని తల్లిదండ్రులు
విద్యార్థులు, స్థానిక రాజకీయ నాయకులతో కొనసాగింపు
చాలా చోట్ల భోజనాలు లేవు
‘నాడు–నేడు’, ఇతర వసతులపై
ప్రస్తావనే లేదు
రాజకీయ వేదికగా మారిన మెగా పీటీఎం3.0


