వాహన పూజకు వస్తూ... అనంత లోకాలకు
జగ్గయ్యపేట: మరికొద్ది క్షణాల్లో ఆలయానికి చేరుకునే తరుణంలో మృత్యువు కబళించిన ఘటన మండలంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై తిరుమలగిరి ఆర్చి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం కాపుగల్లుకు చెందిన బాలిబోయిన వినయ్ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ రెండు రోజుల క్రితం నూతన ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ట్రాక్టర్‌కు వాహన పూజ చేసేందుకు ఉదయం ఇంటి నుంచి ట్రాక్టర్ ఇంజిన్‌తో బయలుదేరాడు. మరికొద్ది క్షణాల్లో ఆలయం వద్దకు చేరుకునే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను వెనుకగా ఢీకొట్టటంతో ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటనలో వినయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న గోవింద నరేష్, చోడవరపు రాధాకృష్ణ, తేజ్ రామ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. వినయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి వివాహం కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


