రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి

Dec 6 2025 7:24 AM | Updated on Dec 6 2025 7:24 AM

రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి

రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి

జాతీయ రహదారి నంబరు 65 పైనే ఎక్కువ ప్రమాదాలు జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్‌ లక్ష్మీశ 2026 లో రోడ్డు ప్రమాద మరణాలను బాగా తగ్గించాలి ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జాతీయ రహదారి–65పైనే ప్రమాదాలు, మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని, వీటిని నియంత్రించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. గతేడాదితో పోలిస్తే 2025లో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయని వివరించారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా రహదారి భద్రతా కమిటీ (డిస్ట్రిక్ట్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీ) సమావేశం జరిగింది. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబుతో కలసి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ మాట్లాడుతూ 2024లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 1343 ఉండగా, ఈ ఏడాది 918 జరిగాయన్నారు. మరణాలు 432 నుంచి 317కి తగ్గాయన్నారు. వివిధ శాఖల సమన్వయంతో కలిసి చేపట్టిన చర్యల వల్ల ఈ పురోగతి సాధ్యమైందన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో మూడోవంతు ప్రమాదాలు, మరణాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని చెప్పారు. జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 65 లో 58 శాతం ప్రమాదాలు, 41 శాతం మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. రహదారులపై వేగ పరిమితులను (స్పీడ్‌ లిమిట్స్‌) తెలిపే సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఓవర్‌ లోడ్‌ తో వెళుతున్న వాహనాలను నియంత్రించాలని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రక్షించిన వారికి ఇబ్బందులేమీ ఉండవు

రోడ్డు ప్రమాదాలలో బాధితులను రక్షించిన వారిపై (గుడ్‌ సమారిటన్‌) ఎలాంటి సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయరని, పోలీసు విచారణ పేరిట ఇబ్బందులు ఉండవని చెప్పారు. అలాంటి ప్రాణదాతలను సత్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రహదారి ప్రమాదాల నివారణలో ఎన్జీవోలు భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు మాట్లాడుతూ భవానీపురం, ఇబ్రహీంపట్నం, పటమట, కంచికచర్ల, కృష్ణలంక పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. బస్టాండ్‌, బెంజ్‌ సర్కిల్‌, రామవరప్పాడు మొదలైన ప్రాంతాలలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలన్నారు. తరచూ ప్రమాదాలు సంభవించే బ్లాక్‌ స్పాట్స్‌ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. పౌరులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చేయడానికి కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులలో శిక్షల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. వచ్చే ఏడాది ప్రమాదాల సంఖ్య మరింత తగ్గించాలన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర, డీసీపీ (ట్రాఫిక్‌) షేక్‌ షెరీన్‌ బేగం, డీఆర్‌ఎస్‌సీ సభ్య కార్యదర్శి, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ జీవీ భాస్కరరావు, డీపీఓ లావణ్య, డీఈవో సుబ్బారావు, ఎన్టీఆర్‌ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుమన్‌ తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement