బీరు సీసాతో పొడిచి యువకుడి హత్య
చిల్లకల్లు (జగ్గయ్యపేట): పాతకక్షలు, గంజాయి వివాదం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలో గురువారం రాత్రి ఒక యువకుడి హత్య జరిగింది. అలవాల నవీన్‌రెడ్డి (29)ని అతడి స్నేహితుడు పిల్లా సాయి హత్య చేశాడు. వీరిద్దరూ విజయవాడకు చెందినవారు. స్థానికులు తెలిపిన మేరకు... విజయవాడ భవానీపురం ప్రాంతానికి చెందిన నవీన్‌రెడ్డి అలియాస్ మూడ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పి నాలుగు నెలల కిందట చిల్లకల్లు మసీదు కాంప్లెక్స్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. అతడిపై సస్పెక్ట్ షీట్ ఉంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన అతడి స్నేహితుడు, రౌడీషీటర్ పిల్లా సాయి రెండునెలల కిందట ఇదే కాంప్లెక్స్‌లో మరో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. చిల్లకల్లు బీసీ కాలనీకి చెందిన తాళ్లూరి గోపి, ఉప్పుతోళ్ల రాజు, అగన్యా వీరిద్దరికీ స్నేహితులయ్యారు. రోజూ రాత్రిళ్లు వీరు పార్టీలు చేసుకునేవారు. గురువారం పిల్లా సాయి పుట్టినరోజు కావడంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ద్విచక్ర వాహనాలపై ఐదుగురు స్నేహితులు ధర్మవరప్పాడుతండా గ్రామంలోని రామ్‌కో సిమెంట్స్ కర్మాగారం వెనుక పంట పొలాల్లో చప్టా వద్ద పార్టీ చేసుకున్నారు. అక్కడ నవీన్‌రెడ్డి, పిల్లా సాయి మధ్య పాతకక్షలకు సంబంధించిన వివాదం తలెత్తింది. మద్యం మత్తులో పరస్పరం దాడి చేసుకున్నారు. సాయి బీరు సీసాను పగలగొట్టి నవీన్‌రెడ్డిని తీవ్రంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో నవీన్‌రెడ్డి కుప్పకూలాడు. వెంటనే సాయి, అగన్యా బైక్‌పై నవీన్‌రెడ్డిని ఎక్కించుకుని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రి వద్దకు తీసుకొచ్చి ఆస్పత్రి వరండాలో పడేసి పరారయ్యారు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించటంతో సీఐ వెంకటేశ్వర్లు, చిల్లకల్లు ఎస్‌ఐ తోట సూర్యశ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నవీన్‌రెడ్డి మృతి చెందాడు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. వీరి స్నేహితులు తాళ్లూరి గోపి, ఉప్పుతోళ్ల రాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోతముక్క ఆడుతున్న
8 మంది అరెస్టు
పెనమలూరు: మండలంలోని కానూరులో కోతముక్క ఆడుతున్న 8 మంది వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పెనమలూరు ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం కానూరు మహదేవపురం కాలనీ వద్ద కోతముక్క ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా కోతముక్క ఆడుతున్న 8 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద రూ.2.26 లక్షలు, ఆరు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


