ట్రెజరీ ద్వారా పెన్షన్లు చెల్లించాలి
ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల సంఘం డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్లకు ట్రెజరీ ద్వారా (010 పద్దు కింద) పెన్షన్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోన దేవదాసు, వల్లూరు వెంకట రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ తీసుకొని గురుకుల పాఠశాలలతో పాటు స్థానిక సంస్థల పెన్షనర్లకు ట్రెజరీ ద్వారా పెన్షన్లు పొందుతుతున్నారని, గ్రంథాలయ సంస్థ పెన్షనర్లకు కూడా అదేవిధంగా వర్తింపచేయాలన్నారు. దీనివలన ప్రభుత్వానికి అదనపు భారం ఉండబోదని స్పష్టం చేశారు. విజయవాడలోని ఏపీ ఎన్జీవో హోంలో శుక్రవారం రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ పెన్షనర్ల గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలు పెంచారని, దీనిని 2018 జూలై 1కి 2020 డిసెంబర్ లోపు రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత రోజే జీపీఎఫ్ నిల్వ సొమ్మును, ఎర్న్ లీవ్ వేతన సొమ్మును చెల్లించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మరణించిన సిబ్బంది వారసులకు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
సంఘం కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా కళ్లేపల్లి మధుసూదనరాజు, ప్రధాన కార్యదర్శిగా వల్లూరి వెంకట రమణ, కోశాధికారి పి.వెంకటేశ్వరరావు, కన్వీనర్‌గా కోన దేవదాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


