స్క్రబ్ టైఫస్‌కు భయపడాల్సిన అవసరం లేదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్క్రబ్ టైఫస్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆ వ్యాధికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి దోమల వలన కలిగే అనర్ధాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇంటి ఆవరణతో పాటు, పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నీటి తొట్టెలు, పూల కుండీలు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పాత సామాన్లు, కూలర్లు వంటి వాటిలో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు.
పాఠశాల సందర్శన
ఆమె పర్యటన సమయంలో జక్కంపూడిలోని ఎంపీపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో స్కూలులో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుండగా ఆ సమావేశంలో పాల్గొని పిల్లలకు స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కలిగించారు. ప్రతి గురువారం స్కూల్ పిల్లలకు ఇచ్చే ఐరన్ ఫోలిక్ మాత్రలపై ఆరా తీశారు. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. స్కూలు బయట అపరిశుభ్ర వాతావరణంలో ఈగలు వాలుతూ అమ్ముతున్న తినుబండారాల వ్యాపారులను అలా అమ్మవద్దని హెచ్చరించారు. ఆమె వెంట పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
డాక్టర్ మాచర్ల సుహాసిని


