రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా రాజ్యమేలుతోంది
●పెంచలయ్య కుటుంబాన్ని
ప్రభుత్వం ఆదుకోవాలి
●రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా రాజ్యమేలుతోందని, గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య హత్య పట్ల ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు అని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. గంజాయి మాఫియా గూండాల చేతిలో హత్య గావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, డ్రగ్స్, గంజాయిని పూర్తిగా రూపుమాపాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో డీవైఎఫ్‌ఐ, పీఎన్‌ఎం, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి.రామన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్, గంజాయి మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. వారం రోజుల క్రితం నెల్లూరులో డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా యువతను ఏకం చేసి పోరాడిన యువజన నాయకుడు, ప్రజా కళాకారుడు పెంచలయ్యను పట్టపగలు నడి రోడ్డు మీద గంజాయి గ్యాంగ్ అతి కిరాతకంగా నరికి చంపారని చెప్పారు. నిందితులను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపైనే దాడి చేయడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి..
100 రోజుల్లో డ్రగ్స్‌ను నిర్ములిస్తాం అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని రామన్న అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, రౌడీ ముఠాలు ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నాయని చెప్పారు. యువత డ్రగ్స్, గంజాయి వైపు కాకుండా ఆటలు, చదువులు, ఉద్యోగాల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్ మాట్లాడుతూ పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి ఇద్దరి పిల్లలు చదువుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, పెంచలయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువత మంచి సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చంద్రనాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పొలారి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ప్రభాత్, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.


