రోగి మెలకువగా ఉండగానే గుండెకు బైపాస్ సర్జరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): మయాస్థీనియా గ్రేవిస్ అనే వ్యాధితో బాధపడుతున్న 76 ఏళ్ల వ్యక్తి మెలకువగా ఉండగానే గుండెకు బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రమేష్‌బాబు తెలిపారు. దేశంలోనే ఇలాంటి సర్జరీని తొలిసారిగా తమ ఆస్పత్రిలో విజయవంతంగా చేశామన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రమేష్‌బాబు మాట్లాడుతూ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న 76 ఏళ్ల వయసు గల విజయవాడకు చెందిన రోగి గుండెకు రక్తం సరఫరా చేసే మూడు ప్రధాన ధమనుల్లో తీవ్రమైన పూడికలు ఉండటంతో పాటు శ్వాసకోశ కండరాలను బలహీనపరిచే మయాస్థీనియా గ్రేవిస్ వ్యాధి కూడా ఉందని చెప్పారు. ఇలాంటి రోగులకు జనరల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు.
వెంటిలేటర్ అవసరం లేకుండా శస్త్రచికిత్స..
దీంతో అవేక్ బైపాస్ టెక్నీక్‌ను తమ వైద్యులు ఎంపిక చేసుకుని ఈ నెల ఒకటో తేదీన రోగి మెలకువగా ఉన్నప్పుడే బైపాస్ సర్జరీ చేశారని తెలిపారు. ఈ పద్ధతిలో శస్త్రచికిత్స జరుగుతున్నంతసేపు రోగి స్పృహలోనే ఉన్నారని, స్వయంగా శ్వాస తీసుకున్నారని వివరించారు. థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా ఛాతీ భాగానికి మాత్రమే మత్తు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వెంటిలేటర్ అవసరం లేకుండా శస్త్రచికిత్స సజావుగా నిర్వహించినట్లు తెలిపారు. తమ అత్యుత్తమ కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్స్, అనస్థీషియా వైద్యుల బృందం సమన్వయంతో ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని డాక్టర్ రమేష్‌బాబు చెప్పారు.


