త్వరలో మరో ఏడు కొత్త ఇసుక రీచ్‌లు
ప్రస్తుతం 9 రీచ్‌లలో 7.27 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉల్లంఘనలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో కొత్తగా ఏడు ఇసుక రీచ్‌లు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆరవ జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక, పట్టా భూముల్లో ఇసుక తొలగింపు, కొత్త రీచ్‌లకు సంబంధించి అనుమతుల ప్రక్రియ, తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కాకుండా తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం తొమ్మిది రీచ్‌ల పరిధిలో 7.27 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. కృష్ణా, మున్నేరు పరిధిలో జగ్గయ్యపేట మండలంలో రెండు, చందర్లపాడు మండలంలో రెండు, కంచికచర్ల మండలంలో 3 కొత్త రీచ్‌లకు సంబంధించిన ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపునకు 34 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 26 దరఖాస్తులను కమిటీ ఆమోదించినట్లు తెలిపారు. రెండు దరఖాస్తులకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు వచ్చాయని, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అక్రమ రవాణాకు సంబంధించి 248 కేసుల నమోదుతో పాటు 440 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు కమిటీకి వివరించారు. సమావేశంలో జిల్లా జేసీ ఎస్.ఇలక్కియ, మైనింగ్ డీడీ శ్రీనివాసరావు, సమన్వయ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


