నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ ముత్యాలంపాడుకు చెందిన పాములపాటి నరేంద్ర, శ్వేత అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116ల విరాళాన్ని సమర్పించారు.
ఎస్‌ఎంసీని సందర్శించిన డబ్ల్యూహెచ్‌ఓ బృందం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలను జెనీవా నుంచి వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), వరల్డ్ డయాబెటీస్ ఫౌండేషన్(డబ్ల్యూడీఎఫ్) బృందాలు గురువారం సందర్శించాయి. ఈ సందర్భంగా కళాశాలలోని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అనుసరిస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, వివిధ ప్రొటోకాల్స్‌పై విస్తృతంగా చర్చ జరిగింది. ఆయా విభాగాల పనితీరును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు వారికి వివరించారు. ఇక్కడ అనుసరిస్తున్న వ్యవస్థీకృత విధానంపై ప్రపంచ బృందాలు ప్రశంసలు వ్యక్తం చేశాయి. ఇక్కడి యూనిట్‌లో అనుసరిస్తున్న ప్రొటోకాల్‌ను జెనీవాలో జరగనున్న సమావేశంలో ఉత్తమ మోడల్‌గా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆశా పర్వీన్ సమన్వయంతో విజయవంతం చేశారు.
18 నుంచి రాష్ట్ర యువజనోత్సవాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా యువజన మహోత్సవం యువ –2025 నిర్వహిస్తున్నట్లు యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్.భరణి తెలిపారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో గురువారం రాష్ట్ర యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర యువజన మహోత్సవం యువ– 2025 నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ ఈ నెల 18, 19, 20 తేదీలలో వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యువజన మహోత్సవాలను ‘యూత్ ఫర్ స్వర్ణాంధ్ర‘ థీమ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ థీమ్ యువత ఆలోచనలు, ప్రతిభ, సృజనాత్మకత రాష్ట్ర అభివృద్ధికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నారు. ప్రతి యేటా జిల్లా, రాష్ట్ర యువజన ఉత్సవాలను నిర్వహించి తద్వారా రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించిన విజేతలను ఢిల్లీలో నిర్వహించే జాతీయ యువ జన ఉత్సవాలకు పంపుతామన్నారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువతకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన ప్రథమ బహుమతి విజేతలు రాష్ట్ర స్థాయిలో జరిగే ఈవెంట్లలో పాల్గొంటారన్నారు. అన్ని జిల్లాల నుంచి దాదాపు 700 మంది యువత పోటీల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. జానపద నృత్య బృందం, జానపద పాటల బృందం, పెయింటింగ్, ప్రకటన, కవితా రచన, కథా రచన, ఆవిష్కరణ (సైన్స్ మేళా ప్రదర్శన) ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు సర్టిఫికెట్, జ్ఞాపిక అందజేస్తామన్నారు. అనంతరం యువజన మహోత్సవం యువ –2025 ఈవెంట్ కర్టెన్ రైజర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఏపీ యూత్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల సీఈవో యు.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం


