పటిష్ట వ్యవస్థలతోనే అభివృద్ధి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
నందిగామరూరల్: వ్యవస్థలు పటిష్టంగా ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మండలంలోని ఐతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావులతో కలిసి గురువారం ఆయన ప్రారంభించి డీడీఓ జ్యోతికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కీలక ప్రగతి సూచికల్లో అభివృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదలకు అన్ని శాఖల అధికారులు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి అన్ని అంశాల్లో పురోగతికి ప్రజా ప్రతినిధులతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం..
ప్రభుత్వ విప్ సౌమ్య మాట్లాడుతూ.. డీడీఓ కార్యాలయాలు గ్రామాల అభివృద్ధికి ఊతమిస్తాయన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, డీపీవో లావణ్యకుమారి, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, డ్వామా పీడీ రాము, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ బాపిరెడ్డి, డీఈ రమేష్, డ్వామా ఏపీడీ లక్ష్మీకుమారి, ఎంపీడీఓలు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


