కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం | - | Sakshi
Sakshi News home page

కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం

Nov 27 2025 5:56 AM | Updated on Nov 27 2025 5:56 AM

కల్లా

కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం

ఖరీఫ్‌ సాగులో అన్నదాతలకు అన్నీ కష్టాలే.. ఇప్పటికే కృష్ణా జిల్లాలో లక్ష ఎకరాల్లో వరికోతలు పూర్తి రోడ్ల వెంట, కల్లాల్లో భారీగా పేరుకుపోయిన ధాన్యం రాశులు గోనె సంచులు, ధాన్యం రవాణాకు వాహనాల కొరత ధాన్యం కొనుగోళ్లకు టీడీపీ నాయకుల సిఫార్సులు తుపాను రూపంలో మళ్లీ ముంచుకొస్తున్న ముప్పు

బస్తా రూ.వెయ్యికే అడుగుతున్నారు

సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: ఖరీఫ్‌ సాగు ఆరంభం నుంచీ అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. దిగుబడులు తగ్గి, మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మోంథా తుపాను దెబ్బ నుంచి కోలుకోక ముందే బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత కలవర పెడుతోంది. అల్పపీడనం తుపానుగా మారక ముందే ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల రైతు సేవా కేంద్రాల్లో గోనె సంచులు లేవు. మిల్లర్లేమో ధాన్యం కొనబోమని తెగేసి చెబుతున్నారు. ఆంక్షలతో విసిగిన రైతులు పంటను దళారులకు తెగనమ్ముతున్నారు. కొన్ని చోట్ల తుపాను భయంతో పంటపూర్తిగా పక్వానికి రాకముందే రైతులు నూర్పిళ్లు చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో

3.98 లక్షల ఎకరాల్లో వరి సాగు

కృష్ణా జిల్లాలో 3.85 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. పది లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 7.90 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా నిర్ణయించారు. 287 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే లక్ష ఎక రాల్లో కోతలు పూర్తవగా కేవలం 12,290 మంది రైతుల నుంచి 1.04 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. జిల్లాలో ప్రధానంగా పెడన, గూడూరు, మచిలీపట్నం, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పామర్రు, కంకిపాడు, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యం నిల్వలే కనిపిస్తున్నాయి. కల్లాల్లో, రోడ్ల పక్కన ధాన్యం రాశులు పేరుకుపోయాయి. అధిక తేమ శాతం పేరిట మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ధాన్యం అరబెట్టేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు కాటా వేసిన ధాన్యం రవాణాకు వాహనాల కొరత వేధిస్తోంది.

ఒక్కో మండలానికి ఒక్కో నిబంధన

ధాన్యం కొనుగోలుకు ఒక్కో మండలంలో ఒక్కో విధంగా నిబంధనలు అమలు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా 17 శాతం తేమ ఉంటే ఏ గ్రేడ్‌ రకం ధాన్యం 76 కిలోల బస్తాను రూ.1,792 చొప్పున కొనాలి. ఒక్కొక్క శాతం తేమకు రూ.18 తగ్గిస్తారు. అప్పుడే కోసిన పంట 27 శాతం తేమ మించదు. దీనిని రూ.1,612 చొప్పున కొనాలి. కొన్ని మండలాల్లో 17 శాతం పైబడి ఎంత శాతం ఉన్నా రూ.1,550 చొప్పునే కొంటున్నారు. అంటే బస్తాకు రూ.240 వరకూ రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తే రైతులు రూ.7,200 నష్టపోతున్నారు. రైతు సేవా కేంద్రంలో 17 శాతం తేమ వచ్చిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద చూపిస్తే 20 శాతం వస్తోంది. అదేమని అడిగితే అక్కడ ఉన్నవి పాత మిషన్లు, తమవి కొత్తవి అని మిల్లర్లు చెబుతున్నా రని రైతులు పేర్కొంటున్నారు. విసిగిపోయిన రైతులు బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు తక్కువకే దళారులకు విక్రయిస్తున్నారు.

టీడీపీ నాయకులు సిఫార్సు చేస్తేనే..

ధాన్యం కొనుగోళ్లకు టీడీపీ నేతల సిఫారసు తప్పని సరిగా మారింది. సొసైటీ ప్రెసిండెట్‌ లేదా గ్రామంలో ముఖ్యనాయకులు చెబితేనే ధాన్యం ముందుకు కదులుతోంది. ప్రధానంగా గుడివాడ, పెనమ లూరు, పామర్రు, పెడన నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. దీంతో రైతులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ క్షేత్రాల ద్వారా సరఫరా చేసిన కొన్ని రకాల ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. 1318, 1218, 1262, 5204 వంటి రకాలను రెండు లక్షల ఎకరాలకు పైగా రైతులు సాగు చేశారు. ఈ రకాలను కొనేందుకు మిల్లర్లు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలేదు. పైరు నేల వాలి దిగుబడి తగ్గి నష్టపో యిన రైతులకు మిగిలిన పంటను విక్రయించేందుకూ కష్టాలు తప్పడంలేదు. ధాన్యంలో తేమ తగ్గించేందుకు రోడ్లపై రోజుల తరబడి ఆరబెడుతున్నారు. ఆరిన ధాన్యాన్ని మిల్లర్లకు తోలాంటే లారీల కొరత వేధిస్తోంది. దీనిని సాకుగా తీసుకున్న దళారులు సిండికేట్‌గా మారి బస్తా ధాన్యాన్ని రూ.1000కే కొంటామంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలి.

– కై లే అనిల్‌కుమార్‌,

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం 1
1/1

కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement