కనుల పండువగా కార్తికేయుని కల్యాణం
మోపిదేవి: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న మోపిదేవిలోని శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారి షష్ఠి కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాద రావు ఆధ్వర్యంలో వేదపండితుడు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో స్వామివార్ల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దేవదాయశాఖ తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణ వేడుకను కనులారా తిలకించారు. జెడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, తహసీల్దార్ ఎం.హరనాథ్, దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, చల్లపల్లి, అవని గడ్డ సీఐలు ఈశ్వరరావు, యువకుమార్, ఎస్‌ఐ పామర్తి గౌతమ్‌కుమార్, కె.వై.దాస్ పలుశాఖల అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


