సదరం స్లాట్లు.. దివ్యాంగుల పాట్లు | - | Sakshi
Sakshi News home page

సదరం స్లాట్లు.. దివ్యాంగుల పాట్లు

Nov 27 2025 5:56 AM | Updated on Nov 27 2025 5:56 AM

సదరం

సదరం స్లాట్లు.. దివ్యాంగుల పాట్లు

● ఉయ్యూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి వెన్నుపూస సంబంధిత సమస్యలతో మూడేళ్లుగా మంచంలోనే ఉన్నాడు. అతను దివ్యాంగ పింఛన్‌ కోసం గత ఏడాది డిసెంబరులో దరఖాస్తు చేయగా, వెయింటింగ్‌ లిస్ట్‌ వచ్చింది. అప్పట్లో పామర్రులో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అయితే ఇప్పటి వరకూ పరీక్ష తేదీ రాలేదు. అతని భార్య సచివాలయానికి వెళ్తే ఒకసారి దరఖాస్తు చేశాక మళ్లీ కుదరదని చెప్పారు. పామర్రు ఆస్పత్రికి వెళ్లి ఆరా తీయగా తాము ఏమీ చేయలేమని వైద్యులు చెప్పారు. దీంతో ఏమి చేయాలో తెలియక ఆ వ్యక్తి సతమతం అవుతున్నాడు. ● విజయవాడ పటమటకు చెందిన 50 ఏళ్ల వ్యక్తికి తుంటి కింద భాగం వరకూ కాలు తీసేశారు. దీంతో దివ్యాంగ పింఛన్‌ కోసం గతేడాది దరఖాస్తు చేసుకోగా వెయిటింగ్‌ లిస్ట్‌ వచ్చింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకూ పరీక్ష తేదీ ఇవ్వలేదు. ● విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడుకు చెందిన దివ్యాంగుడు ఈ ఏడాది జూలైలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైకల్య ధ్రువీకరణ పరీక్ష చేయించుకున్నాడు. అయితే ధ్రువీకరణ పత్రం సదరం సైట్‌లో అప్‌లోడ్‌ కాలేదు. దానికోసం ఎవరిని అడిగినా తమకు తెలియదని సమాధానమే వస్తోందని దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలా నిత్యం అనేక మంది దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగుతున్నారు. అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నప్పటికీ వారి సమస్య పరిష్కారం కావడం లేదు. సదరం సమస్యలు పరిష్కరించాలి

సదరం పోర్టల్‌ మొరాయించడంతో ఎదురవుతున్న ఇబ్బందులు గతంలో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న వారికి పరీక్ష తేదీ ఇవ్వని వైనం పూర్తి వైకల్యం ఉన్న వారి సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు కనిపించని ఆప్షన్‌ ఆ పేపర్లతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు ఈ అంశంపై కుప్పలుగా వస్తున్న దరఖాస్తులు

సైట్‌లో ఆప్షన్‌ కనిపించడం లేదు

లబ్బీపేట(విజయవాడతూర్పు): దివ్యాంగులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పెన్షన్‌లు తీసుకుంటున్న వారికి రీ వెరిఫికేషన్‌ పేరుతో కోత విధించిన చంద్రబాబు ప్రభుత్వం, కొత్త వారికి ధ్రువ పత్రాలు జారీలోనూ వివక్ష చూపుతోంది. దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ కోసం వైద్య పరీక్షలకు దరఖాస్తు చేసుకుందామని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళితే అక్కడి సిబ్బంది సదరం సైట్‌ మొరాయిస్తోందని చెబుతున్నారు. గతంలో ఆన్‌లైన్‌ చేసిన వారికి వెయిటింగ్‌లిస్ట్‌ ఇచ్చారు. దానికి సంబంధించి కొందరికి పరీక్ష తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు పూర్తి స్థాయి వైకల్యం ఉండి, మంచంలోనే ఉన్న వారికి రూ.15 వేల పింఛన్‌ ఇస్తా మని చెప్పినా, ఇప్పటి వరకూ ఆ సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. దీంతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ పేరిట నిర్వహించే గ్రీవెన్స్‌కు దివ్యాంగుల పింఛన్‌ కోసం దరఖాస్తులు కుప్పలుగా వస్తున్నాయి. వాటిని ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఇబ్బందులు ఇలా..

దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌ పొందేందుకు అనేక సమస్యలు ఎదు ర్కొంటున్నారు. ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా తమకేమీ తెలియదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్పమైన ఆదేశాలు ఇవ్వాలి. గతంలో స్లాట్‌ బుక్‌చేసుకుని వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్న వారికి పరీక్ష తేదీని ఖరారు చేయాలి. పూర్తిస్థాయి దివ్యాంగులుగా బోర్డు నుంచి సర్టిఫికెట్‌ పొందిన వారికి దానిని అప్‌లోడ్‌ చేసే ఆప్షన్‌ ఓపెన్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

– వెంకటరెడ్డి,

వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు

పింఛన్‌ కోసం కలెక్టరేట్‌కు వచ్చివెళ్తున్న దివ్యాంగుడు (ఫైల్‌)

దివ్యాంగుల్లో పూర్తి వైకల్యంతో మంచంపైనే ఉన్న వారికి రూ.15 వేల పింఛన్‌ ఇస్తానని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉన్న వారు సదరం ద్వారా మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ధ్రవ పత్రాలు తీసుకున్నారు. వాటిని మరలా అప్‌లోడ్‌చేస్తేనే పింఛన్‌కు అర్హత సాధిస్తారు. ఆ సైట్‌లో ఆ ఆప్షన్‌ కనిపించడం లేదని దివ్యాంగులు చెబుతున్నారు. ఇలాంటి వాళ్లు సచివాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు చొరవ చూపాలని దివ్యాంగులు కోరుతున్నారు.

సదరం స్లాట్లు.. దివ్యాంగుల పాట్లు 1
1/2

సదరం స్లాట్లు.. దివ్యాంగుల పాట్లు

సదరం స్లాట్లు.. దివ్యాంగుల పాట్లు 2
2/2

సదరం స్లాట్లు.. దివ్యాంగుల పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement