భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ ప్రజ లకు అనుక్షణం తోడుగా, నీడగా నిలిచి రక్షిస్తున్న రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. రాజ్యాంగం చూపిన బాటలో నడిచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనిని అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థతో సగర్వంగా నిలిపిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న ఆమోదించుకున్నామని గుర్తుచేశారు. దేశ చరి త్రలో అపూర్వమైన ఈ ఘట్టానికి గుర్తుగా ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటున్నామని వివరించారు. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలను తెలుసుకోవడం ద్వారా మనం ఎంత గొప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నా మనేది స్పష్టమవుతుందన్నారు. రాజ్యాంగ విశిష్టతను తెలుసుకోవడమనేది ఏదో ఒక్క రోజుకే పరిమితం చేసుకోకుండా రోజూ రాజ్యాంగం గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూ ప్రగతి పథంలో పయనించాలని సూచించారు. రాజ్యాంగ రూపకల్పనకు విశేష కృషిచేసిన డాక్టర్ అంబేడ్కర్ వంటి మహనీయుల బాటలో యువత నడుస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
విజేతలకు బహుమతి ప్రదానం
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పాఠశాల విద్యాశాఖ నియోజకవర్గ స్థాయిలో క్విజ్, వక్తృత్వం, వ్యాస రచన విభాగాల్లో పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో విజేతలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పతకాలు అందజేశారు. రాజ్యాంగ పీఠికను చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు బాగా చదువుకొని మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో అడుగులేస్తూ పయనించాలని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. డీఈఓ యు.వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ


