నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఈ శాఖకు సంబంధించి గుర్తింపు పొందిన సంఘాల నేతలతో ఆ శాఖ కమిషనర్, ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పేరుతో జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలు అనేక సమస్యలు లేవనెత్తనున్నాయి. సమావేశం అజెండాపై ఇప్పటికే ఆయా సంఘాల నేతలు రెండు రోజులుగా వివిధ రూపాల్లో చర్చించారు.
అధికారాలకు కోత..
సర్కిల్ కార్యాలయాల్లో పని చేస్తున్న జీఎస్‌టీఓ అధి కారులకు సంబంధించి గతంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిపై ఆ శాఖ కోత విధించింది. ఫలితంగా సమస్యలు తలెత్తుతున్నాయని, పూర్తి స్థాయి విధి నిర్వహణకు అడ్డంకిగా ఉందని ఆయా సంఘాల నేతలు చెబుతున్నారు. తిరిగి అధికారాలు కల్పించే అంశంపైనా చర్చించాలని నేతలు కోరుతున్నారు. వివిధ జిల్లాల ఉద్యోగులను అమరావతి పరిధిలోకి బదిలీపై తీసుకొచ్చారు. దీంతో ఆయా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదిలీపై వచ్చిన వారిని తమ మాతృస్థానాలకు పంపాలని సంఘాలు కోరుతున్నాయి. న్యాయస్థానాల్లో ఉన్న కేసులు పరిశీలన, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీటీ కార్యాలయాలకు సంబంధించి ఉద్యోగులకు కేవలం బదిలీలపై కాకుండా ఉద్యోగోన్నతులపై కేటాయించాలని సంఘాల నేతలు కోరుతున్నారు.


