అనుమానమే.. పెనుభూతమై..
పట్టపగలు అందరూ చూస్తుండగానే భర్త దారుణం పోలీసులు వచ్చే వరకు కత్తితో అక్కడే ఉన్న నిందితుడు
విజయవాడ సూర్యారావుపేటలోని ఓ ఆస్పత్రి వద్ద ఘటన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రేమించి పెళ్లాడారు. ముచ్చటగా మూడేళ్లయినా కాపురం సజావుగా సాగలేదు. ఇంతలోనే ఆ దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తన నచ్చక కక్ష పెంచుకున్న భర్త ఆమెను పట్టపగలు అందరూ చూస్తుండగానే కత్తితో పీక కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన గురువారం మధ్యాహ్నం విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్వాతిప్రెస్ రోడ్డులోని ఓ ఆస్పత్రి వద్ద జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇవి..
ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఆమెకు దుర్గాపురానికి చెందిన దీపాల విజయ్‌తో పరిచయం ఏర్పడింది. విజయ్ కూడా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పని చేస్తుండటంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లికి విజయ్ నిరాకరించడంతో పెద్దల రాజీతో 2022లో నూజివీడులోని బీఎస్పీ కార్యాలయంలో పెళ్లి చేశారు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
భార్య ప్రవర్తనపై అనుమానంతో..
ప్రస్తుతం సరస్వతి విజయవాడ సూర్యారావు పేటలోని విన్స్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుండగా, విజయ్ భవానీపురంలోని ఎస్‌ఓఎస్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. వీరి మధ్య కలతలు రావడం, భార్య ప్రవర్తనపై అనుమానంతో ఏడాదిగా విడిగా ఉంటున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఆమె తీరుపై మరింత కోపంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సరస్వతి తాను పనిచేసే ఆస్పత్రిలో మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని బయటకు వచ్చింది. అప్పటికే బైక్‌పై వచ్చి గేటు వద్ద కాపు కాచి, వేచిచూస్తున్న విజయ్, ఆమె రాగానే ఒక్కసారిగా పదుపైన కత్తితో దాడి చేసి గొంతు కోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
పోలీసులు వచ్చే వరకూ అక్కడే..
భార్యను పీక కోసి చంపేసిన విజయ్ పోలీసులు వచ్చే వరకూ భార్య మృతదేహం పక్కనే ఉన్నాడు. రక్తంతో తడిసిన కత్తి చేత్తో పట్టుకొని నిర్భయంగా అక్కడే నిలబడి ఉన్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరించనున్నట్లు సీఐ అహ్మద్ అలీ తెలిపారు.
భార్యను హత్య చేసి, అక్కడే కత్తితో ఉన్న భర్త
నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
భార్య గొంతు కోసి హత్య
అనుమానమే.. పెనుభూతమై..


