తీర్పుల్లో వయోవృద్ధుల చట్ట స్ఫూర్తి కనిపించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వయోవృద్ధుల సంక్షేమ చట్ట స్ఫూర్తి ట్రైబ్యూనళ్ల ఉత్తర్వుల్లో ఉట్టిపడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. పెద్దరికం ఎన్నటికీ చిన్నబోకూడదని.. వయోవృద్ధులకు నేడు మనం ప్రేమ ఆప్యాయతలను పంచితే భవిష్యత్తులో మన పిల్లల నుంచి కూడా అవే ఆత్మీయతానురాగాలను పొందుతామని ఆయన పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి వయోవృద్ధుల సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. విజయవాడ, తిరువూరు, నందిగామ రెవెన్యూ డివిజన్లతో పాటు అప్పీలేట్ ట్రైబ్యూనల్‌కు వచ్చిన క్లెయిమ్‌ల పరిష్కారంతో పాటు వయోవృద్ధుల క్షేమం, సంక్షేమానికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. మొత్తం 433 క్లెయిమ్‌లకుగాను ఇప్పటికే 395 క్లెయిమ్‌ల పరిష్కారమైనట్లు చెప్పారు. మిగిలిన క్లెయిమ్‌ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. వయోవృద్ధుల సంక్షేమం విషయంలో రెవెన్యూ, పోలీస్, వయోవృద్ధుల సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రతి గ్రామంలో లాఫింగ్ క్లబ్‌లు..
వయోవృద్ధుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రతి గ్రామంలోనూ లాఫింగ్ క్లబ్‌ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో నెలలో ఒకసారి సీనియర్ సిటిజన్స్‌తో సమావేశాలు నిర్వహించాలన్నారు. డివిజన్, జిల్లా స్థాయిలోనూ ఇదే విధమైన చొరవ చూపాలన్నారు. వయోవృద్ధులు తమ అనుభవాల సారాన్ని చిన్నారులకు తెలియజెప్పి.. వారిలో నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు జెన్ ఆల్ఫాకు సరైన కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో డీసీపీ కేజీవీ సరిత, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వి.కామరాజు, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, ఉమ్మడి కృష్ణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వరరావు, సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ల సభ్యులు హాజరయ్యారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ


