కృష్ణానదిలో తప్పిన పడవ ప్రమాదం
కృష్ణానదిలో తప్పిన పడవ ప్రమాదం
వేదాద్రి(జగ్గయ్యపేట): కృష్ణానదిలో ప్రయాణిస్తున్న పడవకు ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపీరి పీల్చుకున్నారు. గ్రామంలోని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దనున్న కృష్ణానది నుంచి పల్నాడు జిల్లా గింజుపల్లి మధ్య పడవలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వేదాద్రి నుంచి 30 మంది ప్రయాణికులతో పడవ గింజుపల్లికి బయలుదేరింది. ఈ క్రమంలో ఒక్కసారిగా నది మధ్యలోకి వెళ్లగానే ఇంజన్ ఆగిపోవటంతో కొంత మేర దిగువకు కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేయటంతో పడవ సిబ్బంది నదిలోకి దిగి సురక్షితంగా రెండు గంటల పాటు శ్రమించి పడవను గింజుపల్లి వైపు ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు. పడవలో నిబంధనలు పాటించకపోవటం, లైఫ్ జాకెట్లు లేకపోవటంతో పాటు పడవ రాకపోకలకు అనుమతులున్నాయో లేదో తెలియదంటున్నారు స్థానికులు. పడవ ఇంజన్ ఆగిపోయి రెండు గంటల పాటు నదిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం.
గుంటూరు డివిజన్
మీదుగా ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థాం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ పీఆర్‌ఓ వినయ్‌కాంత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్–కాకినాడ టౌన్(07619) వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈనెల 16వ తేదీన ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. ఎస్‌ఎంవీటి బెంగళూరు–భాగల్‌పూర్(06565) రైలు విజయవాడ డివిజన్ మీదుగా ఈనెల 15వ తేదీన కేటాయించినట్లు తెలిపారు. ఈ రైలు కృష్ణరాజపూరం, కాట్‌పడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, పలాస, భరంపూర్, కూర్ద్ రోడ్, భువనేశ్వర్, కటక్, భదర్కా, ఖరగ్‌పూర్, అన్‌దూల, భట్టానగర్, రామ్‌పూర్ హట్, బారహరవా, షిబన్‌జీ స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు.