అయ్యా.. మాకో దారి చూపండి!
తెల్లక్వారీకి దారి చూపించాలని కార్మికుల ఆందోళన గుంటూరు జిల్లా పేరేచర్ల నుంచి వచ్చి మైనింగ్ కార్యాలయం వద్ద నిరసన గనులు భూగర్భ శాఖ రాష్ట్ర డైరెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి
టీడీపీ నేత ఆగడాలతో తీవ్రంగా నష్టపోతున్నాం
ఇబ్రహీంపట్నం: ఓ టీడీపీ నాయకుడి ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని, తమ తెల్లక్వారీకి ‘దారి’ చూపాలని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన వడ్డెర క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఇబ్రహీంపట్నంలోని గనులు భూగర్భ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం తొమ్మిది గంటలకే కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని.. కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఆందోళన చేశారు. టీడీపీ నాయకుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వ మాజీ మంత్రి కనుసన్నల్లో పేరేచర్ల టీడీపీ నాయకుడు పి. వెంకటేశ్వరరావు తమ క్వారీకి వెళ్లేందుకు ఉన్న దారిని పొక్లయినర్‌తో తవ్వేశారని మండిపడ్డారు. సుమారు 13నెలలుగా క్వారీలో పనులు చేసుకునే అవకాశం లేనందున కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వంద మందికి జీవనాధారం..
వడ్డెర ప్రజాగళం సంఘం అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలోని సుమారు 50కుటుంబాలకు చెందిన వంద మంది వడ్డెర కులస్తులు క్వారీని నడుపుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. వడ్డెరలను తమ క్వారీ పైకి వెళ్లకుండా స్థానిక టీడీపీ నాయకుడు, ప్రముఖ కాంట్రాక్టర్ పి. వెంకటేశ్వరరావు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆయన 11ఎకరాల క్వారీని ఒక్కడే నడుపుకుంటున్నారని, 100మంది సొసైటీ కార్మికులు కేవలం రెండెకరాల్లో క్వారీని నడపుకొంటుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
గతంలోనూ ఇలానే..
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దారిని 1973 నుంచి అందరూ వినియోగించుకుంటున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. గతంలో దారిని అడ్డుకున్న పి. వెంకటేశ్వరరావు ఆగడాలు అప్పట్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపారని చెప్పారు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దారిలో నడవకుండా అడ్డుకుంటున్నారని, తన అనుచరులతో క్వారీ కార్మికులపై దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు.
అన్ని అనుమతులతోనే..
అప్పులు తెచ్చి ప్రభుత్వానికి రూ.40లక్షలు లీజు కింద చెల్లించి క్వారీ నడుపుకొంటున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. 13నెలలుగా దారిలేక, క్వారీ నడవక వడ్డెర కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో పలువురు పెద్దలకు చెప్పినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. గత్యంతరం లేక క్వారీ పైకి వెళ్లేందుకు క్వారీలో నిలువునా తాడు సహాయంతో నిచ్చెన ఏర్పాటు చేసుకుని ప్రమాదం అంచున ఎక్కుతున్నామని, దానిని కూడా బడా కాంట్రాక్టర్ అడ్డుకుని వడ్డెరలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.


