ఆగని కన్నీటి వరద
పరిహారం పేరుతో పరిహాసం..
‘మోంథా’ దెబ్బకు అగమ్యగోచరంగా వరి రైతు పరిస్థితి
కంకిపాడు: మోంథా తుపాను వెళ్లిపోయినా.. అది మిగిల్చిన నష్టాన్ని చూసి అన్నదాతల్లో కన్నీటి వరద ప్రవహిస్తూనే ఉంది. చేతికి అందుతుందనుకున్న కొద్దిపాటి పంట కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పొలంలో ఉన్న తేమ కారణంగా వరి పనలు పాచిపోయి కుళ్లిపోతున్నాయి. వరి కంకులు నీటిలో నాని మొలకెత్తుతున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది.
కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1.54లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. ప్రధానంగా ఎంటీయూ, బీపీటీ, ఇతర వంగడాలను రైతులు ఎంపిక చేసి సాగు చేపట్టారు. వరి పైర్లు చిరుపొట్ట, కంకులు గట్టి పడే దశలో ఉండగా మోంథా తుపాను రూపంలో ప్రకృతి విరుచుకుపడింది. జిల్లాలో 45,040 హెక్టార్లలో వరి పంట నేలవాలినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించారు. తుపాను పోయి 14రోజులు గడిచి సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నా.. పంట పొలాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. వరి పనలు నేలవాలిపోయి ఉండటంతో పొలాల్లో మురుగు ఆరడం లేదు.
భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. తుపాను వెలిశాక పొలాల్లో నీటిని అతికష్టం మీద పక్కనే ఉన్న పంట బోదెల్లోకి మళ్లించుకోగలిగారు. అయితే పొలాల్లో మురుగు మాత్రం నేటికీ అలాదే ఉంది. వరిపనలు పంట పొలంలో పడిపోయి ఉండటంతో బురద ఆరడం లేదు. దీంతో బురదకు తడిచిన వరి పనలు పాచిపోయి కుళ్లిపోతున్నాయి. కంకులు గట్టిపడే దశలోకి వస్తున్న పైర్లలో అయితే గింజలు మొలకెత్తిపోతున్నాయి. పాచిపోయి దెబ్బతింటున్న పనలు, మొలకెత్తుతున్న కంకులను చూసి రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే ఒక్కో రైతు ఎకరాకు రూ. 30వేల నుంచి రూ. 35వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. కౌలు ఒప్పందాలు 20–22 బస్తాలు వరకూ ఉన్నాయి. కౌలు ఎలా చెల్లించాలో కూడా అర్థం కావటం లేదని వారు వాపోతున్నారు. నేలవాలిన పంటను కొందరు రైతులు దుబ్బులు కట్టిస్తున్నారు. ఇందుకు ఎకరాకు రూ.5వేల వరకూ పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడి కూడా చేతిలో లేకపోవటంతో దుబ్బులు కట్టించేందుకు సైతం రైతులు వెనకాడుతున్నారు.
మరో వైపు గత సీజన్‌లో ఇప్పటికే వరి కోతలు మొదలై ధాన్యం మిల్లులకు తరలించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ కోతలు ఊపందుకోలేదు. దీనికి తోడు పంట పొలాలు బురదగా ఉండటంతో రబీ సీజన్‌లో అపరాల సాగుకు ఆలస్యమై దిగుబడుల్లో వ్యత్యాసం వచ్చే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆపద సమయంలో ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కారు అన్నదాతల దీనస్థితితో ఆటలాడుతోంది. పరిహారం అందించే పేరుతో పరిహాసం చేస్తోంది. జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో వరి పంట నేలవాలి పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. అయితే పంట నష్టం సర్వే సమయానికి ఆ విస్తీర్ణం పూర్తిగా తగ్గింది. కేవలం 75,781 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. పెట్టుబడులు కోల్పోయి, దిగుబడులు నష్టపోయిన తరుణంలో చేయిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అరకొర సాయం అందించేందుకు పూనుకోవటం విడ్డూరమంటూ రైతులు పెదవి విరుస్తున్నారు.
ఆగని కన్నీటి వరద


