ఎన్టీఆర్ జిల్లాలో 217 డ్రగ్ హాట్‌స్పాట్లు గుర్తింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను చైతన్య పరచాలని, ఇందు కోసం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో ఎన్ కార్డ్ – నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో 217 డ్రగ్ హాట్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. గడచిన మూడు నెలల్లో జిల్లా ఈగల్ బృందం రైళ్లలో ఏడు, బస్సులు, బైకులు, గోడౌన్లలో పది సోదాలు నిర్వహించి డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 200 మంది డ్రగ్స్ బాధితులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడ నగరానికి మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్న పరిస్థితిపై ప్రత్యేకదృష్టి సారించాలని ఆదేశించారు. ఒడిశా నుంచి విజయవాడ మీదుగా ఉత్తరభారతానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను ఆటోనగర్‌లో గుర్తించి ఐదు లారీలు, ఒక కారు సీజ్ చేసి, ఐదుగురిని అరెస్టు చేసిన ఈగల్ బృందానికి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని ఈగల్ నంబర్ 1972కు తెలపాలని కోరారు. డ్రగ్స్ బాధితులు ఆర్‌ఆర్ పేటలోని జిల్లా డీ–అడిక్షన్ కేంద్రం, విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స, కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చని సూచించారు. ప్రతినెలా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక అవగాహన ర్యాలీని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్జీఓలు విద్యా సంస్థలపై దృష్టి సారించి యువతను చైతన్య పరచి, డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే దుష్పరిణామాలను తెలపా లని సూచించారు. డ్రగ్స్ వినియోగం, నిల్వ, రవాణా, అమ్మకం ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం నేరమని, వీరికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పారు. సామాజిక బాధ్యతగా మాదకద్రవ్యాల నిరోధానికి తమ వంతు కృషి చేస్తామని కమిటీ సభ్యుల చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కామరాజు, ఈగల్ సీఐ ఎం.రవీంద్ర, ఎస్‌ఐ ఎం.వీరాంజనేయులు, ఎస్‌ఆర్‌ఆర్ – సీవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ఎన్జీఓలు పాల్గొన్నారు.
డ్రగ్స్ హాట్ స్పాట్లపై
ప్రత్యేక దృష్టిసారించాలి
ఎన్ కార్డ్– నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ


