కార్తికేయుడి ఒక్క రోజు ఆదాయం రూ.11.65 లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మంగళవారం ఒక్క రోజే రూ.11,65,718 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. స్వామివారి సేవా టిక్కెట్ల ద్వారా రూ.7,92,078, లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.1,99,770, నిత్యాన్నదానానికి విరాళాలుగా రూ.1,46,842, వివిధ టిక్కెట్లు, ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయం రూ.27,028 కలిపి మొత్తం రూ.11,65,718 సమకూరిందని వివరించారు.
విద్యాభివృద్ధికి బాటలు వేసిన అబుల్ కలాం ఆజాద్
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ అని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మంగళవారం పోలీస్ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి సీపీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖర బాబు మాట్లాడుతూ.. విద్యారంగంలో అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషికి గౌరవంగా నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. ఆయన విద్యారంగానికి చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న‘ ఇచ్చి గౌరవించిందన్నారు. 2008 నుంచి ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్య్ర సమర ముఖ్యనాయకులలో ఒకరని, అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ వంటి అనేక భాషల్లో ప్రవీణుడ న్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ పోలీస్ కమిషనర్ కృష్ణకాంత్ పాటిల్, సీఎస్‌బీ, సీసీఆర్‌బీ, సీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్తికేయుడి ఒక్క రోజు ఆదాయం రూ.11.65 లక్షలు


