వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్ర బాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని, ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని స్పష్టంచేశారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్య చదవాలకునే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ, 10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంత కాల కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంతకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారన్నారు. వాటిలో ఏడు కాలేజీల పనులు పూర్తి కాగా, ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యా యని తెలిపారు. మరో 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు.
పేదలకువైద్యం దూరం..
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందవని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా రోగ నిర్ధారణ, ఇన్‌పేషెంట్, మెడిసిన్స్‌కు చార్జ్ చేస్తారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉచిత వైద్య సేవలు దూరమై పేద రోగులు.. మెడికల్ సీట్లు కోల్పోయి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరే కంగా వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిందన్నారు. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇకనైనా చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా
అధ్యక్షుడు దేవినేని అవినాష్


