మల్లవల్లి భూ నిర్వాసితులకు తీవ్ర నిరాశ
హనుమాన్‌జంక్షన్ రూరల్: జనసేన పార్టీ అధినేత, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు తమ బాధను చెప్పుకొనేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి వెళ్లిన మల్లవల్లి పారిశ్రామికవాడ భూనిర్వాసితులకు తీవ్ర నిరాశ ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడ ఏర్పాటుతో భూములు కోల్పోయిన కృష్ణాజిల్లాలోని మల్లవల్లి, ఏలూరు జిల్లాలోని గొల్లపల్లి, పొలసానిపల్లె గ్రామాల రైతులు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళవారం తరలివెళ్లారు. అయితే అక్కడ డెప్యూటీ సీఎంను కలవలేకపోవడంతో ఉసురుమన్నారు. ‘పవన్‌కల్యాణ్ ఇప్పుడూ రారు.. జనవాణి నిర్వహిస్తున్న నాయకులకు మీ వినతిపత్రం అప్పగించి వెళ్లిపోండి’ అంటూ అక్కడి సిబ్బంది చెప్పటంతో భూ నిర్వాసితులు కన్నీటి పర్యంతమయ్యారు. 2024 ఎన్నికలకు ముందు పవన్‌కల్యాణ్ స్వయంగా మల్లవల్లి వచ్చి, అధికారంలోకి రాగానే పారిశ్రామికవాడ బాధితులకు న్యాయం చేస్తానని తమకు హామీ ఇచ్చారని, గంపెడు ఆశలో ఆయనను నమ్మామని బాధితులు వాపోయారు. ఈ భూములపైనే ఆధారపడి జీవనం సాగించే తమ కుటుంబాలకు పరిహారం దక్కకపోతే అత్మహత్యే శరణ్యమంటూ నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి కార్యాలయానికి వెళ్లిన వారిలో వీసం రామకృష్ణ, అక్కిలిశెట్టి బుజ్జి, ముక్కు శేఖర్, గోగినేని సావిత్రి, దోనేపూడి పద్మ, తదితరులు ఉన్నారు.


