రైల్వేస్టేషన్‌లో ఫోన్ దొంగల ముఠా అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లల్లో ఫోన్లను కాజేస్తున్న దొంగల ముఠాను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఫతే ఆలీబేగ్, జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జె.వి రమణ దీనికి సంబంధించిన వివరాలను జీఆర్‌పీ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవి..
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆర్‌పీఎఫ్ పరిధిలో పెరుగుతున్న మొబైల్ దొంగతనం కేసులపై ఆర్‌పీఎఫ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీసీ టీవీల దృశ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, పాత నేరస్తులను విచారించడం ద్వారా మొబైల్స్ చోరీలకు పాల్పడిన పాత నేరస్తులను గుర్తించారు. వారిలో నవజీవన్ బాలభవన్‌లో ఆశ్రయం పొందుతున్న బంగారు రాంబాబు, వైఎస్సార్ కాలనీకి చెందిన వంకూరి ప్రకాష్, కంసాలిపేటకు చెందిన బురదగంటి నవీన్ క్రాంతి ముఠాగా ఏర్పడి రైల్వేస్టేషన్, రైళ్లలో ప్రయాణికుల నుంచి మొబైల్స్ దొంగిలించి కదులుతున్న రైలు నుంచి దూకి తప్పించుకుంటున్నట్లు నిర్ధారించారు.
రైల్వే సిబ్బందినంటూ..
వారిలో ఏ1 ముద్దాయి బంగారు రాంబాబు రైల్వేలో అనేక చోరీలకు పాల్పడ్డాడు. ఇతను చోరీ చేసిన మొబైల్‌ను స్వీచ్ఛాఫ్ చేయకుండా ఉంచుతాడు. మొబైల్ పొగొట్టుకున్న బాధితులు ఫోన్‌చేస్తే నిందితుడు ఫోన్ లిఫ్ట్‌చేసి తాను ఆర్‌పీఎఫ్, లేదా జీఆర్‌పీ కానిస్టేబుల్ అని నమ్మించి ఆర్‌పీఎఫ్ లేదా జీఆర్‌పీ స్టేషన్‌లో మొబైల్ అప్పగిస్తానని, అందుకోసం ఫోన్ నీదే అన్న నమ్మకం కోసం ఫోన్ లాక్, ఆధార్ కార్డును సేకరించి, వారి ఖాతాలోని నగదును ఖాళీ చేసేవాడు.
పదో నంబర్ ప్లాట్ ఫాంపై..
కాగా నిందితులు ముగ్గురు సోమవారం విజయవాడ రైల్వేస్టేషన్ పదో నంబర్ ప్లాట్‌ఫాంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారు చోరీ చేసిన రూ.9లక్షల విలువ చేసే 45 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రూ. 9లక్షల విలువ చేసే 45 ఫోన్‌లు స్వాధీనం


