డిజిటలైజ్ కానున్న విద్యార్థుల సమాచారం
కోనేరుసెంటర్: విద్యార్థుల పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ పర్సన్ ఆచార్య కె. రత్న షీలా తెలిపారు. సోమవారం కృష్ణా విశ్వవిద్యాలయంలో ‘అపార్ ఐడీ’ల మీద అవగాహన కోసం ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మొత్తాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో ఆధార్ తరహాలో వన్ నేషన్ – వన్ స్టూడెంట్ ఐడీ పేరుతో అపార్ ఐడీ అనే ఒక స్టూడెంట్ అకడమిక్ ఐడీని విద్యార్థుల ఫోన్ నంబర్‌తో అనుసంధానం చేసి రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఎక్కడైనా సర్టిఫికెట్లు డౌన్‌లోడ్..
కృష్ణా విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ అపార్ ఐడీని ఉపయోగించుకుని మున్ముందు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా విద్యార్థులు వాళ్ల సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుందన్నారు. ఈ అవగాహన సదస్సుకు ఆంధ్ర కేసరి, ఆచార్య నాగార్జున, కృషా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ అటానమస్ కళాశాలల్లో అపార్ ఐడీలో పర్యవేక్షించే సమన్వయకర్తలు హాజరు కాగా, ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్త రోహిత్ కశ్యప్, జోనల్ సమన్వయకర్త రవి పాండే పాల్గొని ఈ అపార్ ఐడీల మీద వివిధ కళాశాల నుంచి వచ్చిన వారి సందేహాలను నివృత్తి చేశారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుంచి అనిల్ కుమార్, ఎల్లారెడ్డి పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.
ఏపీ ఉన్నత విద్యా మండలి
వైస్ చైర్ పర్సన్ రత్నషీలా


