చట్టబద్ధ దత్తత ఒక వరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా ఈ ఏడాది నవంబర్ నెలలో దత్తతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి చట్టబద్ధంగా దత్తత తీసుకోవడం ఒక వరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, అధికారులతో కలిసి శ్రీ పింగళి వెంకయ్య హాల్‌లో దత్తత అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దత్తతకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ దళారీలను నమ్మవద్దని.. చట్ట పరంగా దత్తత తీసుకోవడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటే సమగ్ర బాలల సంరక్షణ పథకం, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖను సంప్రదించాలని కోరారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల దత్తత ఇతివృత్తంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


