పశుసంవర్ధక శాఖలో ఏహెచ్‌ఏ పోస్టులు భర్తీ చేయాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్(ఏహెచ్‌ఏ) పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు.
డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం ఏహెచ్‌ఏ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ లబ్బీపేటలోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే పశు సంపద, పశుపోషణలో ముందున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, పశువులను రక్షించే విషయంలో అదే స్థాయిలో చొరవ చూపాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సేవా కేంద్రాల్లో క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో దాదాపు యాభై వేలమంది నిరుద్యోగులు ఇందుకు సంబంధించిన కోర్సులు చేసి, శిక్షణ తీసుకుని ఉన్నారని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు కె. రమేష్, నగర అధ్యక్షుడు శివ, నాయకులు శీను, బసవ తదితరులు పాల్గొన్నారు.


