భక్త కనకదాస జీవితం ఆదర్శనీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో చేరువ చేసిన తత్వవేత్త భక్త కనకదాస జీవితం నేటి తరానికి ఆదర్శదాయకమని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భక్త కనకదాస జయంతి వేడుకలు శనివారం జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశ, 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ హాజరై కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రామధ్యాన చరిత్ర, మోహన తరంగిణి వంటి ప్రధాన రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయని, కనకదాస జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభి వృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. 20 సూత్రాల పథకం చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్షను రూపుమాప డంలో కనకదాస రచనలు ఎంతో దోహదపడతాయన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా బీసీ సంక్షేమ అధికారి డి.లక్ష్మీదేవి, డివిజనల్ సంక్షేమ అధికారులు ఆర్.రవిప్రసాదరావు, పి. శ్రీనివాసరావు, వార్డెన్లు ఎం.రజని, విజయదుర్గ, మేరి జాన్సన్, సూపరింటెండెంట్ పి.రాజకుమారి తది తరులు పాల్గొన్నారు.


