ఉరేసుకుని వాచ్‌మేన్ మృతి
పెనమలూరు: అపార్టుమెంట్ వాచ్‌మేన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రమేష్(42) భార్య సంజీవ, ఇద్దరు కుమార్తెలతో నాలుగు నెలల క్రితం పోరంకి వచ్చాడు. ఒక అపార్టుమెంట్‌లో వాచ్‌మేన్‌గా కుదిరాడు. దురలవాట్ల కారణంగా ఈ నెల 6న భార్యతో గొడవ జరిగింది. దీంతో ఆమె పెదకళ్లేపల్లి వెళ్లి పోయింది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌లో ఉండే సూర్యనారాయణ అనే వ్యక్తి రమేష్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని శుక్రవారం రాత్రి సంజీవకు ఫోన్ చేసి చెప్పాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్: నీట మునిగిపోతున్న ఎందరినో కాపాడిన గజ ఈతగాడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని కుమ్మరి కాలనీకి చెందిన కాల్వ ముత్యాలరావు(49) పెద్ద చెరువులో చేపల పెంపకం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చేపల మేత వేసేందుకు పడవలో మరో ఇద్దరుతో కలిసి రాత్రి వేళ చెరువులోకి వెళ్లాడు. ఆకస్మాత్తుగా పడవ ఒరిగిపోవటంతో ప్రమాదవశాత్తూ జారి చెరువులోకి పడ్డాడు. కేకలు వేయటంతో గ్రామస్తులు రక్షించేందుకు యత్నించారు. ముత్యాలరావును గుర్తించి బయటకు తీసేటప్పటికే ప్రాణాలొదిలాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పలుమార్లు చెరువులు, కాల్వల్లో పడిన వారిని బయటకు తీసిన ముత్యాలరావు నీట మునిగి మృతి చెందటంతో గ్రామస్తులు విషాదంలో మునిగారు.


