సైన్ బోర్డులపై ఆలయ సమాచారం
కనకదుర్గనగర్ మీదుగానే
రాకపోకలు..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ సమాచారం అందరికీ అర్థమయ్యే రీతిలో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయనున్నామని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ తెలిపారు. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు శుక్రవారం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డిలోని బోర్డు సమావేశ మందిరంలో సమావేశమైంది. చైర్మన్ రాధాకృష్ణ అధ్యక్షతన ఈవో శీనానాయక్, బోర్డు సభ్యులు, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో భవానీ దీక్ష విరమణలలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం 26 అంశాలు చర్చకు రాగా, 18 అంశాలకు ఆమోదం లభించింది. మిగిలిన ఎనిమిది అంశాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు.
తొలి అంశం ఇదే..
దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరల టెండర్ అంశం తొలి అజెండాగా సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ అంశాన్ని బోర్డు సభ్యులతో చర్చించి కౌంటర్ మరో ప్రాంతానికి మార్పు చేసే అంశంపై చర్చించేందుకు తదుపరి సమావేశంలో చేర్చాలని తీర్మానించారు. కొండపై ఓం టర్నింగ్ వద్ద రూ. 27.90లక్షలు పలికిన కూల్‌డ్రింక్ షాపు టెండర్‌ను భక్తుల భద్రత దృష్ట్యా రద్దు చేయాలని తీర్మానించారు. ఇక భవానీ దీక్ష విరమణలకు సంబంధించి పలు ఇంజినీరింగ్ పనులను బోర్డు సభ్యులు ఆమోదించారు. ప్రతి నిత్యం జరుగుతున్న అన్నదానంలో భక్తులకు రెండో దఫా కూరలు వడ్డించేందుకు దిట్టం పెంచాలని దేవస్థాన అధికారుల సూచనను బోర్డు సభ్యులు తిరస్కరించారు. అమ్మవారి సన్నిధిలో వేకువ జామున భక్తులకు అల్పాహారం అందించేందుకు చేసిన ప్రతిపాదనను బోర్డు ఆమోదం తెలిపింది. రానున్న ఉగాది పర్వదినం నుంచి దీనిని అమలు చేసే అవకాశం ఉందని బోర్డు సభ్యులు పేర్కొంటున్నారు.
రానున్న కాలంలో కనకదుర్గనగర్ మీదుగానే భక్తులు రాకపోకలు సాగించేలా ఆలయ నిర్మాణ పనులు చేపట్టామని చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. బోర్డు సమావేశం అనంతరం చైర్మన్, ఈవోలు మీడియాతో మాట్లాడారు. ఘాట్‌రోడ్డుపై ఒత్తిడిని తగ్గించేలా భవిష్యత్తులో భక్తులందరూ కనకదుర్గనగర్ నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల ద్వారానే కొండపైకి చేరుకుంటారన్నారు. ప్రముఖులు, వీఐపీలు మినహా మిగిలిన భక్తులను మహా మండపం మీదుగానే ఆలయానికి చేరుకునేలా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామన్నారు. కొండ దిగువన ఉన్న షాపులను మహా మండపం ఐదో అంతస్తుకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ కుంకుమ ప్యాకెట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు, ఎక్స్‌అఫిషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.


