బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంధిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరగనున్న ఇళయరాజా మ్యూజికల్ కాన్సర్ట్ కార్యక్రమ బందోబస్తు ఏర్పాట్లు శుక్రవారం సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు పరిశీలించారు. ఇతర పోలీస్ అధికారులతో కలిసి స్టేడియంతో పాటు, పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ పరంగా సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షిరీన్ బేగం, ఎస్‌వీడీ ప్రసాద్, ఏడీసీపీలు, ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.
విరిగిన రైల్వేగేటు.. తప్పిన ముప్పు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మధురానగర్ పప్పులమిల్లు రైల్వేగేటు శుక్రవారం సాయంత్రం విరిగిపోయింది. దీంతో విజయవాడ నుంచి గుడివాడ వైపు వెళ్లే రైలు పావు గంటకు పైగా నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి గుడివాడ వైపు రైలు వస్తుండటంతో గేటుమ్యాన్ రైల్వేగేటు వేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా రైల్వేగేటు విరిగి పడిపోయింది. అదృష్టవశావత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒక్కసారిగా రైలు గేటు విరిగిపడటంతో సిగ్నల్ లేక రైలు నిలిచిపోయింది. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైలును పంపించారు. అదృష్టవశాత్తూ రైల్వేగేటు ఎవరిమీద పడలేదని ఒకవేళ పడితే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తుపాను బాధిత రైతాంగాన్ని ఆదుకుంటాం
కంకిపాడు: తుపాను బాధిత రైతాంగాన్ని ఆదుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మండలంలోని పునాదిపాడు గ్రామంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మోంథా తుపాను వల్ల దెబ్బతిని పడిపోయిన వరి పొలాలను పరిశీలించారు. తుపాను వల్ల పంట నష్టపోయామని, తమన ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని నిబంధనలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని అభ్యర్థించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పర్యటనలో జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, ఉయ్యూరు ఆర్డీఓ హెలా షారోన్, పామర్రు ఏడీఏ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యుని సేవలో..
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని కేరళ రాష్ట్రం అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ట్రస్టీ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీభాయి శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆమె ప్రముఖ సినీనటులు కొల్లా అశోక్‌కుమార్‌తో కలసి నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, రావి రత్నగిరి పాల్గొన్నారు.
బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన


