జీవనశైలిలో మార్పులతో అసంక్రమిక వ్యాధులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవనశైలిలో మార్పులతో అసంక్రమిక వ్యాధులు పెరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. అందులో భాగంగా మధుమేహం, అధిక రక్తపోటులతో పాటు, క్యాన్సర్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు ఆమె తెలిపారు. క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ సుహాసిని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యాధులు సోకకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదని, ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఇంధుమతి, డాక్టర్ మాధవి, డాక్టర్ నవీన్, డాక్టర్ భానూ నాయక్, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


