నేడు ఏసు క్రీస్తు జయంతి జూబ్లీ వేడుకలు
పటమట(విజయవాడతూర్పు): దివంగత పోప్ ఫ్రాన్సిస్ 2025వ సంవత్సరాన్ని జూబ్లీ ఏడాదిగా ప్రకటించిన నేపథ్యంలో ఏసుక్రీస్తు జయంతి–2025 జూబ్లీ వేడుకలను నగరంలో నిర్వహిస్తున్నట్లు విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు తెలిపారు. శుక్రవారం పటమటలోని బిషప్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. వేడుకలను శనివారం ఉదయం 8.30 గంటలకు నగరంలోని లయోలా కళాశాల ప్రాంగణంలో ఉన్న ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామన్నారు విశాఖపట్నం ఆర్చ్ బిషప్ ఉడుముల బాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఆరు జిల్లాల బిషప్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుత పోప్ లియో 14 ఆదేశాల మేరకు ఆరు జిల్లాల్లోకి కథోలిక మేత్రాసనాలు సంయుక్తంగా విజయవాడలో వేడుకలు నిర్వహిస్తున్నామని, ఇందులో 1600 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.
దేవునికి కృతజ్ఞతలు తెలిపేందుకే..
గుంటూరు కథోలిక పీఠం బిషప్ చిన్నాబత్తిన భాగయ్య మాట్లాడుతూ 2025 ఏళ్లక్రితం క్రీస్తు జననం ద్వారా ఈ ప్రపంచానికి వెలుగు వచ్చిందని, సర్వ జనులను ఏసుక్రీస్తు రక్షణగా నిలిచారని, ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునేందుకు ఈ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. నెల్లూరు బిషప్ ఎండీ ప్రకాశం, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం. గాబ్రియేలు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సునీల్ రాజు తదితరులు పాల్గొన్నారు.


